చాయ్‌వాలాల విశ్వవిహారం త్వరలో పుస్తకరూపం

ఆమె పేరు మోహన. ఆయన పేరు విజయన్. ఇద్దరూ కోచ్చిలోని సలీం రాజన్ లేన్‌లో టీకొట్టు నడుపుతారు. ఈ చాయ్‌వాలాలు మేడ్ ఫర్ ఈచ్ అదర్. వీరు రోజూ చాయ్ అమ్మేది పొట్టపోసుకోవడానికే కాదు.. లోకాన్ని చుట్టిరావడానికి కూడా. భర్తకు 70 సంవత్సరాలు. భార్యకు 69 సంవత్సరాలు. సుమారు 50 ఏళ్ల దాంపత్య జీవితం. భార్యల్ని వేధించే భర్తలు, భర్తల్ని సాధించే భార్యల జోకులు ఇక్కడ కుదరవు. ఇద్దరూ అప్పుడే పెళ్లయిన కుర్రజంటలా తుళ్లిపడుతుంటారు. తుమ్ అగర్ సాథ్ దేనేకా వాదా కరో అంటూ ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకుని ప్రపంచం చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. ఈ ఉలగం సుట్రుం వాలీబన్లు 2007తో మొదలుపెట్టి ఇప్పటిదాకా 12 ఏళ్లలో  25 దేశాలు చూసివచ్చారు.  చాయ్‌వాలాలు ప్రపంచ యాత్రలు చేయడం ఏమిటని అప్పుడే ముక్కు మీద వేలేసుకోకండి. విదేశీయానం చేయడానికి బ్యాంకులకు కన్నం వేయాలని ఏమీ లేదు. కొంచెం ప్రణాళికాబద్ధమైన పొదుపు చాలు అనేది వీరి థియరీ. రోజంతా చాయ్ అమ్ముతూ సంతోషంగా రెక్కలుముక్కలు చేసుకుంటారు. రేపటి విదేశీయానం వారి ముఖాల మీద చిరునవ్వు చెరగనీయదేమో.