మ‌నం కొనే అమెరికా హెలికాప్ట‌ర్లు ఇవే..

ప్ర‌పంచంలోనే అత్యుత్తమ ఆయుధాలు మా ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని .. మొతేరా స్టేడియంలో ట్రంప్ చెప్పిన‌ విష‌యం తెలిసిందే. భార‌త్ త‌మ ద‌గ్గ‌ర ర‌క్ష‌ణ ఆయుధాలు కొనుగోలు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆ ర‌క్ష‌ణ ఒప్పందం విలువ‌ సుమారు 3 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌న్నారు.  అయితే అమెరికా వ‌ద్ద భార‌త్ కొనుగోలు చేసే ఎంఎచ్‌-60ఆర్ సీహాక్ హెలికాప్ట‌ర్లు ఇవే.  సుమారు 24 సీహాక్ హెలికాప్ట‌ర్ల‌ను ఖ‌రీదు చేసేందుకు భార‌త్ అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.  ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యంలో రెండు దేశాలు కీల‌కంగా మార‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.  ఈ భూమండలంలోనే అత్యంత ఉత్త‌మ‌మైన‌, భ‌యాన‌క‌మైన సైనిక ఆయుధాల‌ను అమెరికా త‌యారు చేస్తుంద‌ని ట్రంప్ అన్నారు.  యాంటీ ఎయిర్ సిస్ట‌మ్స్‌ను కూడా భార‌త్ ఖ‌రీదు చేస్తుంద‌ని ట్రంప్ త‌న సందేశంలో తెలిపారు. డ్రోన్లను కూడా భార‌త్ ఖ‌రీదు చేసే సూచ‌న‌లున్నాయి.  24 సీహాక్ హెలికాప్ట‌ర్ల ఖ‌రీదు దాదాపు 16వేల కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  వీటితో పాటు మ‌రో ఆరు అపాచీ హెలికాప్ట‌ర్లు (ఏహెచ్‌-64ఇ)ల‌ను 6వేల కోట్లు పెట్టి కొనుగోలు చేయ‌నున్నారు.